వికసిత్ భారత్‌కు పునాది రాయి.. విశాఖ గూగుల్ ఏఐ హబ్: బికాస్ కోలే

  • వికసిత్ భారత్‌కు గూగుల్ ఏఐ హబ్ పునాది లాంటిదన్న గూగుల్ క్లౌడ్ గ్లోబల్ ఇన్ ఫ్రా వైస్ ప్రెసిడెంట్
  • విశాఖ గ్లోబల్ ఏఐ ఎకానమీ దిశగా పరుగులు పెట్టనుంద‌ని బికాస్ కోలే జోస్యం
  • ముంబై, చెన్నై సరసన అంతర్జాతీయ గేట్ వేగా ఆవిర్భావం
  • స్థానిక యువతకు ఉద్యోగాలు, ఏఐలో ప్రత్యేక శిక్షణ
  • మహిళా పారిశ్రామికవేత్తలకు చేయూత అందిస్తామన్న గూగుల్
విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తున్న గూగుల్ ఏఐ డేటా సెంటర్, 2047 నాటి వికసిత్ భారత్ లక్ష్యానికి ఒక పునాది రాయి లాంటిదని గూగుల్ క్లౌడ్ గ్లోబల్ ఇన్ ఫ్రా వైస్ ప్రెసిడెంట్ బికాస్ కోలే అన్నారు. శంకుస్థాపన కార్యక్రమం అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఏఐ యుగంలో ఈ డేటా సెంటర్ కీలక పాత్ర పోషిస్తుందని, భారత డిజిటల్ పరివర్తనలో ఇది అత్యంత ముఖ్యమైనదని వివరించారు.

ఈ ప్రాజెక్టుతో విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గ్లోబల్ ఏఐ ఎకానమీ దిశగా పరుగులు పెడతాయని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటివరకు అంతర్జాతీయ సబ్ సీ గేట్ వేలుగా ఉన్న ముంబై, చెన్నైల సరసన ఇప్పుడు విశాఖ కూడా నిలుస్తుందని స్పష్టం చేశారు. కొత్తగా ఏర్పాటు చేయనున్న ఫైబర్ ఆప్టిక్ కేబుల్ లైన్లు విశాఖను ఇతర ప్రాంతాలతో అనుసంధానిస్తాయని, దీనివల్ల సంప్రదాయ నౌకాయాన మార్గాలు ఇకపై డిజిటల్ ట్రేడ్ రూట్లుగా మారతాయని పేర్కొన్నారు. ఈ డేటా సెంటర్ ఏర్పాటులో భాగస్వామ్యం వహిస్తున్న అదానీ కనెక్స్, ఎయిర్‌టెల్ నెక్స్‌ట్రాలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

ఇండస్ట్రియల్ కారిడార్‌గా ఎదుగుతున్న విశాఖకు ఈ డేటా సెంటర్ టెక్నాలజీ భవిష్యత్తును అందిస్తుందని కోలే అన్నారు. స్థానిక యువతకు ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు, వారికి అడ్వాన్స్‌డ్ క్లౌడ్, ఏఐ టెక్నాలజీలపై శిక్షణ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. దాదాపు 10 వేల మందికి పైగా మహిళలు మైక్రో ఎంటర్‌ప్రైజ్‌లు స్థాపించేందుకు గూగుల్ సహకారం అందిస్తుందని వెల్లడించారు.

ఈ ప్రాంతానికి ఇంధన భద్రత కల్పించేలా కొత్త ట్రాన్స్‌మిషన్ లైన్లు, ఎనర్జీ స్టోరేజి వ్యవస్థలను ఏర్పాటు చేస్తామన్నారు. పర్యావరణ పరిరక్షణతో పాటు, ఈ ప్రాంతానికి ఆర్థిక స్థిరత్వం కల్పించేలా ఈ డేటా సెంటర్‌ను నిర్మిస్తున్నామని బికాస్ కోలే వివరించారు.

Bikash Koley
Google AI Hub
Vizag
Google Cloud

More Telugu News